సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు .. తాపి నదిలో దొరికిన తుపాకులు , బుల్లెట్లు
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్పుల వ్యవహారంపై ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిందితులు వాడిన తుపాకీ కోసం గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని తాపీ నదిలో తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు పడుతున్న కష్టానికి మంగళవారం ప్రతిఫలం దక్కింది.
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం తాపీ నదిలో రెండు తుపాకులు, 13 బుల్లెట్లను, మూడు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ప్రసిద్ధి చెందిన సీనియర్ ఇన్స్‌పెక్టర్ దయానాయక్‌తో సహా 12 మంది అధికారుల బృందం సోమవారం నుంచి తాపీ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపినట్లుగా విక్కీ గుప్తా, సాగర్‌పాల్‌ను గుర్తించారు. ఈ ఘటన తర్వాత తాము ముంబై నుంచి సూరత్ .. అక్కడి నుంచి భుజ్ వైపు రైల్లో ప్రయాణించామని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు.
Also Read : బీహార్ : ఇండియాకి , ఎన్డీయేకి చెమటలు పట్టిస్తోన్న పప్పు యాదవ్
ఈ క్రమంలో తమ వద్ద వున్న తుపాకీని రైల్వే బ్రిడ్జి పై నుంచి తాపీ నదిలోకి విసిరేసినట్లు వారు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఈతగాళ్లు, మత్స్యకారుల సాయంతో నదిలో తుపాకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముంబైలోని బాంద్రా గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల ఏప్రిల్ 14న కాల్పులు చోటు చేసుకున్నాయి.
భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యేలోపు దుండగులు వెంటనే హెల్మెట్‌లతో ముఖాలను కప్పుకుని మోటార్ సైకిల్‌పై పారిపోయారు. నిందితులు తొలుత పన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో రెక్కీ నిర్వహించారు. కేవలం సల్మాన్‌ను భయపెట్టాలని, హత్య చేయరాదని నిందితులు కుట్ర చేశారని పోలీసులు వెల్లడించారు. సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరపేందుకు ప్రధాన లక్ష్యం బీభత్సం సృష్టిండమేని తెలిపారు.
Also Read : చంద్రబాబు కీలక నిర్ణయం .. ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్ధుల మార్పు , ఉండి నుంచి రఘురామ
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ పేరుతో వున్న ఫేస్‌బుక్ ఖాతాలో కాల్పులకు తామే బాధ్యులమని తెలిపింది. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరగడానికి 3 గంటల ముందు ఈ ఖాతాను తెరిచినట్లుగా తెలుస్తోంది. బిష్ణోయ్ సోదరులిద్దరూ దుండగులను దాడికి డైరెక్ట్ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సల్మాన్ ఖాన్‌ను ఆయన ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బిష్ణోయ్ గ్యాంగ్‌ను అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముంబైలో అండర్ వరల్డ్‌కు స్థానం లేదని.. ఇక్కడ ఎవరూ అలాంటి పనిచేయడానికి సాహసించకుండా తాము బిష్ణోయ్ గ్యాంగ్‌ను అంతం చేస్తామని ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు.
సల్మాన్ ఖాన్‌తో లారెన్స్ బిష్ణోయ్‌కి వివాదం ఏంటీ :
1998లో హామ్ సాథ్ సాథ్ హై సినిమా చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణజింకలను వేటాడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించి 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన బిష్ణోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణ జింకలను ఈ కమ్యూనిటీ వారు .. తమ గురువు జంబేష్వర్ అలియాస్ జంబాజీగా భావిస్తారు. కృష్ణజింకల సంరక్షణను వీరు చేపడతారు.
Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం .. కూటమి అభ్యర్ధులను గెలిపించాలంటూ చిరంజీవి పిలుపు
అలాంటి ఈ మూగజీవాలను సల్మాన్ వేటాడటంపై గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సల్మాన్‌ను చంపేస్తామంటూ పలుమార్లు హెచ్చరించాడు కూడా. 2018లో కృష్ణజింకల కేసులో కోర్టుకు హాజరైన సల్మాన్ ఖాన్‌పై తొలిసారి దాడి చేయించాడు. ఆ తర్వాత 2022లో తన గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రాను కండల వీరుడి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడానికి పంపించాడు. ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తోంది.
Comments
Post a Comment